రేవంత్ సహా మరో ఎంపీ కమలం గూటికి ?

Another MP including Revanth Reddy Join into BJP

తెలంగాణలో పాగా వేయడానికి పావులు కదుపుతున్న బీజేపీ బలం పెంచుకునే ఆలోచనలు చేస్తోంది. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటే గెలుచుకున్నా లోక్ సభ ఎన్నికల్లో మాత్రం అనూహ్యంగా 4 స్థానాలకి ఎగబాకింది. కాంగ్రెస్ పని అయిపొయింది, టీఆర్ఎస్‌కి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా కాంగ్రెస్‌ నుంచీ నేతలని దిగుమతి చేసుకునే పనిలో పడింది. అలా ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా ఇద్దరు కీలక ఎంపీలను తమవైపు తిప్పుకొబోతోందని సమాచారం. నిజానికి నిన్న తెలంగాణ కాంగ్రెస్‌‌కు చెందిన ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డితో… బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ రహస్య చర్చలు జరిపినట్లు తెలిసింది. వారే కాక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, మాజీ ఎంపీ వివేక్‌, కేసీఆర్‌ అన్న కూతురు రమ్యారావు కూడా రామ్‌మాధవ్‌ను కలిశారని రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలయ్యింది. ఇప్పటికే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరిపోవడం, మరి కొందరు కూడా చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారనే ప్రచారంతో కాంగ్రెస్ పెద్దల్లో టెన్షన్ నెలకొని ఉంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచీ గెలిచింది ముగ్గురు ఎంపీలు అందులో ఇద్దరు పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కోలుకోవడం చాలా కష్టమే.