అమ్మొ మంకీ ఫీవర్: వెలుగులోకి వచ్చిన మరో వైరస్… ముగ్గురు మృతి

ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారత్ లో క‌రోనా కేసుల సంఖ్య 6 వేలు దాటింది. ఇక క‌ర్ణాట‌క‌లోనూ క‌రోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అక్క‌డ మ‌రో వ్యాధి క‌ల‌కలం రేపుతున్న‌ది. శివ‌మొగ్గ జిల్లాలో మంకీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఇప్ప‌టికే 139 మందికి మంకీ జ్వరాలు వచ్చాయని…. వారిలో ముగ్గురు మృతి చెందార‌ని శివ‌మొగ్గ జిల్లా డిప్యూటీ కమిషనర్ కేబీ శివకుమార్ తెలిపారు. అలాగే… మ‌రో 130 మందికి చికిత్స చేయడంతో వారు కోలుకుంటున్న‌ట్లు వెల్లడించారు.

కాగా గ‌త ఏడాది కూడా శివమొగ్గ జిల్లాలో మంకీ జ్వరాలు తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆ సమయంలో సుమారు  400 మందికి మంకీ ఫీవ‌ర్ రాగా.. వారిలో 23 మంది మరణించారు. ఈ ఏడాది కూడా అక్క‌డ మంకీ జ్వరాలు ప్రబలడంతో జిల్లా ప్రజలు కలవరపడుతున్నారు. కాగా.. శివమొగ్గ అడవుల్లోని కోతుల ద్వారా ఈ మంకీ ఫీవ‌ర్ వ‌స్తున్న‌ట్లు అధికారులు చెప్తున్నారు.

అయితే ముఖ్యంగా ఈ వ్యాథి బారిన పడిన వారికి తలనొప్పి, అధిక జ్వరంతో పాటు గొంతు, చిగుళ్ళు నుండి రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి.  అలాగే జీర్ణాశయంలో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా వాంతులు, కండరాలు మొద్దుబారడం, ప్రకంపనలు రావడం, మానసికంగా మనస్తాపానికి  గురికావడం వంటివి కూడా లక్షణాలుగా గుర్తించారు. అలాగే.. ఈ వ్యాథి బారిన పడిన వ్యక్తి రెండు వారాలలో కోలుకోవచ్చని.. కాని దాని ప్రభావం మాత్రం సాధారణంగా చాలా కాలం వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా కండరాల నొప్పులు, బలహీనతల కారణంగా బాధిత వ్యక్తి శారీరక పట్టుదలను కోల్పోతాడని వైద్య నిపుణులు గుర్తించారు.