హాట్ స్పాట్ నిభందనలు ఇవే :తెలంగాణలో 130 హాట్ స్పాట్ లు….

విశ్వాన్నే వణికించేస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. కరోనా కేసులు అధికంగా ఉన్న 130 ప్రాంతాలను హాట్ స్పాట్ లుగా గుర్తించింది. అయితే ముందుగా కరోనా హాట్ స్పాట్ లను పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. ఆ ప్రాంతానికి దాదాపు కిలోమీటర్ల ప్రాంతంలో ఎవ్వరినీ బయటకి వెళ్ళనివ్వరు. జనసంచారం పూర్తిగా నిషిద్ధంగా ఉంటుంది.

సూటిగా చెప్పాలంటే ఆ ప్రాంతం మొత్తం క్వారంటైన్ అయినట్లే. వీరందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతవాసులంతా అత్యవసరమైతే తప్ప బయటకు రావటానికి వీలు లేదు. ఎవరికైనా అత్యవసర సమస్య ఉత్పన్నమైతే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. అందుకు ప్రత్యేకంగా ఓ నెంబర్ ను కేటాయిస్తారు. రోజు నిత్యావసరాలు ఇంటికే వస్తాయి. ఈ బాధ్యతలన్నీ ఆయా జిల్లాల కలెక్టర్ లు, మార్కెటింగ్, పౌర సరఫరాలు సమన్వయం చేసుకొని పోలీసుల సమక్షంలో పంపిణీ చేస్తాయి.

అదేవిధంగా ఇప్పటికే హైదరాబాద్ లో 12 ప్రాంతాలను కంటోన్మెంట్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా 14రోజుల పాటు ఆయా ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఇంటింటి సర్వే చేస్తారు. అనుమానితులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఈ 14రోజుల్లో ఏ రోజు పాజిటివ్ కేసులు వెలుగు చూసినా మరో 14 రోజులు దిగ్బంధనం పెంచుతారు. పూర్తిగా ఆయా ప్రాంతాల్లో ప్రజలందరికీ నెగిటివ్ వచ్చే వరకు పోలీసుల కనుసన్నల్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి హైదరాబాద్ లోని హాట్ స్పాట్ లపై పోలీసులు దృష్టి సారించారు.