మూడు రాష్ట్రాలు.. మూడు భాష‌లు.. ముగ్గురు కామ్రేడ్‌లు

anthem song released from dear comrade

యూత్ సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన డియ‌ర్ కామ్రేడ్ చిత్రం జూలై 26న విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రానికి జోరుగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు జ‌రుపుతున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు సాంగ్స్‌తో పాటు ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేశారు. వీటికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక డియ‌ర్ కామ్రేడ్ యాంత‌మ్ సాంగ్ అంటూ ఓ వీడియోని ఉద‌యం 11.11ని.ల‌కి విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మైత్రి మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించింది. కాని పలు కార‌ణాల వ‌ల‌న సాంగ్ రిలీజ్ లేట్ అవుతుందని పేర్కొంది. ఈ సాంగ్ యూత్‌కి కిక్కెంచ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. యాంత‌మ్ సాంగ్‌ని త‌మిళంలో విజయ్ సేతుప‌తి ఆల‌పించ‌గా, మ‌ల‌యాళంలో దుల్క‌ర్ స‌ల్మాన్, తెలుగులో విజ‌య్ దేవ‌ర‌కొండ ఆలపించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ సంగీతం అందించారు. దక్షిణాది భాష‌లైన తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, కన్న‌డ భాష‌ల్లో ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మైత్రీ మూవీమేక‌ర్స్, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, సి.వి.ఎం(మోహ‌న్‌), య‌శ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ర‌ష్మిక మంథాన కథానాయిక‌గా న‌టించింది.