యుద్దభూమిని తలపిస్తున్న తమిళనాడు… పోలీసుల చేతిలో 10 మంది మృతి !

Anti-Sterlite protest in Tamil Nadu Tuticorin turns violent

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

తమిళనాడు రాష్ట్రంలోని తూత్తకుడి రణరంగంగా మారింది. స్థానిక స్టెరిలైట్ రాగి కర్మాగారాన్నివిస్తరించాలని జరుగుతున్న యత్నాలను నిరసిస్తూ ప్రజాసంఘాల ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. నిరసన కార్యక్రమాన్ని శాంతియుత వాతావరణంలో ఒక ఖాళీ ప్రదేశంలో చేసుకోవాలి అని పోలీసులు కోరగా ప్రదర్శనకారులు మాత్రం ఫ్యాక్టరీ ముందే చేస్తాం అని భీష్మించుకు కుర్చోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు… ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన ఆందోళనకారులు జిల్లా కలెక్టరేట్ లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. అయితే, పట్టణంలో 144 సెక్షన్ విధించినప్పటికీ స్థానిక చర్చి వద్ద గుమిగూడిన నిరసనకారులు తొలుత కర్మాగారం వైపు వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవటంతో కోపోద్రిక్తులు అయిన ఉద్యమకారులు ఒక్క సారిగా పోలీసుల మీద మూకుమ్మడి దాడికి దిగటంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా… మరో ఆరుగురు గాయపడినట్టు సమాచారం.

దీంతో మరింత రెచ్చిపోయిన ఆందోళన కారులు కలెక్టరేట్‌లోకి చొరబడి నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించిన అనంతరం లాఠీఛార్జి చేశారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారు. ఈ సంఘటన నేపథ్యంలో అదనపు పోలీస్ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో రేపు తూత్తకుడి జిల్లా బంద్ కు వాణిజ్య సంస్థలు పిలుపు నిచ్చాయి. ఆందోళనకారులపై పోలీసుల దాడిని ఖండించిన వాణిజ్య సంస్థలు ఈమేరకు నిర్ణయం తీసుకున్నాయి. తమిళనాడులో అల్లర్ల నేపథ్యంలో డీఎంకే అగ్రనేత స్టాలిన్ బెంగళూరులో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి వెళ్లొద్దని స్టాలిన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. రేపు తూత్తకుడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. మక్కళ్ నీది మయ్యం అధినేత కమలహాసన్ ఈ సంఘటనను ఖండించారు.