మాజీ కేంద్రమంత్రి దత్తత్రేయ ఇంట తీవ్ర విషాదం… ఏకైక కుమారుడి మృతి

బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్ హఠాన్మరణం చెందారు. నిన్న రాత్రి 10:45 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేస్తుండగా గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ముషీరాబాద్‌లోని గురునానక్ కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ జాయిన్ చేసుకున్న వైద్యులు ఆయనకు చికిత్స మొదలుపెట్టారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి 12:30 గంటలకు మృతి చెందాడు. వైష్ణవ్‌ను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని వైద్యులు ప్రకటించారు. వైష్ణవ్ వయసు 21 సంవత్సరాలు. వైష్ణవ్ ప్రస్తుతం ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో దత్తాత్రేయ కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. విషయం తెలిసిన పలువురు నేతలు దత్తాత్రేయను పరామర్శించారు.