రాత్రే కొడుకు మరణించినా దత్తన్నకి తెలియనివ్వని కుటుంబసభ్యులు…

Bandaru Dattatreya Son Vaishnav passed away

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

49 సంవత్సరాల వయసులో లేకలేకపుట్టిన బిడ్డ 21 ఏళ్లకే దూరమైన వేళ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. గత రాత్రి దత్తాత్రేయ ఏకైక కుమారుడు వైష్ణవ్, హఠాన్మరణం చెందిన సంగతి తెలిసిందే. లేక లేక కలిగిన కుమారుడి మరణవార్తను ఈ ఉదయం తెలుసుకున్న దత్తన్న హతాశులయ్యారు. ఆయన్ను పరామర్శించేందుకు పలువురు నేతలు వచ్చినా, ఎవరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో ఆయన లేరని తెలుస్తోంది. దత్తాత్రేయ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓ ప్రత్యేక వైద్య బృందాన్ని ఆయన ఇంటివద్ద ఏర్పాటు చేశారు.

రాత్రి పదిన్నర గంటలకు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తుండగా బండారు వైష్ణవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే బండారు దత్తాత్రేయ డాక్టర్ ఆవుల రామచంద్రరావు తదితరులు సమీపంలోనే ఉన్న గురునానక్ కేర్ ఆసుపత్రిలో చేర్చారు. ‘సార్… ఏం కాదు… మేము చూసుకుంటాం కదా మీరు ఇంటికెళ్లండి’ అని రామచంద్రారావు తదితరులు చెప్పడంతో ఎంపీ దత్తాత్రేయ ఇంటికెళ్లి నిద్రపోయారు. తరువాత పన్నెండున్నర గంటల సమయంలో వైష్ణవ్ మరణించాడని డాక్టర్లు అధికారికంగా ప్రకటించారు. అయితే తన కుమారుడు మరణించిన విషయం దత్తాత్రేయకు ఉదయం 5 గంటలదాకా తెలియదు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ పని చేయాల్సి వచ్చిందని దత్తన్న బంధువులు వెల్లడించారు.

కుమారుడంటే అమితమైన ప్రేమను చూపే దత్తాత్రేయకు ఆ విషయాన్ని చెబితే, ఏమవుతుందోనన్న ఆందోళనలో విషయాన్ని చెప్పలేదు. వైష్ణవ్ మృతదేహాన్ని కూడా తెల్లవారుజాము వరకూ ఆసుపత్రిలోనే ఉంచి, ఆపై ఇంటికి తీసుకెళ్లారు. ఉదయం 5 గంటల ప్రాంతంలో రోజులాగానే లేచిన దత్తాత్రేయ, విషయం తెలుసుకుని కుప్పకూలిపోయారు. దత్తాత్రేయకు 49 సంవత్సరాల వయసులో వైష్ణవ్ జన్మించాడు అందుకే వైష్ణవ అంటే ఆయనకీ అమితిమయిన ప్రేమ. ఆ తరువాత దత్తాత్రేయ దంపతులకు కుమార్తె విజయలక్ష్మి జన్మించింది. అన్నయ్య మరణంతో విజయలక్ష్మి కన్నీరు మున్నీరవుతోంది. దత్తాత్రేయను హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, నటుడు నందమూరి హరికృష్ణ తదితరులు పరామర్శించారు. గత రాత్రి మరణించిన దత్తన్న కుమారుడు వైష్ణవ్ అంత్యక్రియలు, ఈ సాయంత్రం హైదరాబాద్, సైదాబాద్ పరిధిలోని శ్మశాన వాటికలో జరగనున్నాయి. మధ్యాహ్నం నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుందని బండారు కుటుంబీకులు తెలిపారు.