కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలట్లేదు… నెమ్మదిగా బాలీవుడ్లో పాగా వేసిన ఈ వైరస్ ప్రముఖుల ఇంట్లోకి చొరబడుతోంది. ఇప్పటికే బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ విషయం చిత్ర పరిశ్రమను షాక్‌కు గురి చేసింది. వారు త్వరగా కోలుకోవాలని ఆంక్షిస్తూ అనేకమంది సెలబ్రిటీలు, అభిమానులు చేస్తున్న పోస్టులతో సోషల్ మీడియా తడిసి ముద్దవుతోంది. ఈ క్రమంలో మరో బాలీవుడ్ నటుడి ఇంట కరోనా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అనుపమ్ ఖేర్ కుటుంబంలో ఒకేసారి నాలుగు కేసులు బయటపడ్డాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడిస్తూ ఆదివారం ట్విటర్లో వీడియో రిలీజ్ చేశారు.
“అమ్మ దులారి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఆస్పత్రికి తీసుకెళ్లగా కోవిడ్ ఉన్నట్లు తేలింది. అయితే ఆమెలో కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఆమెను ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రిలో చేర్పించాం. ఆమెతో పాటు తమ్ముడు(రాజు ఖేర్), మరదలు, మేనకోడలు కూడా కరోనా బారిన పడినట్లు నిర్ధారణ అయింది. వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బీఎంసీ అధికారులు, వైద్యులు మాకు ఎంతగానో సహకరించారు. నేను కూడా పరీక్ష చేయించుకోగా నెగెటివ్ అని వచ్చింది. ప్రస్తుతం మేము హోమ్ క్వారంటైన్లో ఉన్నాం. సోదరుడి ఇంటిని శానిటైజ్ చేస్తున్నారు” అని అనుపమ్ పేర్కొన్నారు.