అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గౌత‌మ్ స్ట‌యిల్లో ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గౌత‌మ్ స్ట‌యిల్లో ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

గ‌త రెండు ద‌శాబ్దాల్లో ద‌క్షిణాదిన నుంచి వ‌చ్చిన అత్యంత విల‌క్ష‌ణ‌మైన ద‌ర్శ‌కుల్లో గౌత‌మ్ మీన‌న్ ఒక‌డు. కాక్క కాక్క (ఘ‌ర్ష‌ణ‌).. సూర్య‌ స‌న్నాఫ్ కృష్ణ‌న్‌.. ఏం మాయ చేసావె.. వేట్ట‌యాడు విల‌యాడు (రాఘ‌వ‌న్‌).. ఎన్నై అరిందాల్ (ఎంత‌వారు గానీ).. లాంటి అద్భుత‌మైన సినిమాలొచ్చాయి అత‌డి నుంచి. గౌత‌మ్‌తో ప‌ని చేయ‌డాన్ని అంద‌రూ ఒక గౌర‌వం లాగా భావిస్తారు. కెరీర్లో ఒక్క సినిమా అయినా గౌత‌మ్‌తో చేయాల‌ని ఆశ‌ప‌డే స్టార్ల‌కు లెక్క లేదు. ఐతే గొప్ప టాలెంట్ ఉన్న ఈ ద‌ర్శ‌కుడి నుంచి సినిమా వ‌చ్చి నాలుగేళ్లు అవుతోంది. అలాగ‌ని అత‌ను సినిమాలు తీయ‌ట్లేదా అంటే అదేమీ లేదు. రెండేళ్ల కింద‌టే రెండు సినిమాలు (ఎన్నై నొక్కి పాయుం తోటా, ధృవ‌న‌క్ష‌త్రం) పూర్తి చేసి పెట్టాడు. అవి విడుద‌ల‌కు నోచుకోవ‌ట్లేదు.

సొంత నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు తీసిన‌ గౌత‌మ్‌కు మ‌ధ్య‌లో ఫైనాన్షియ‌ర్ల‌తో స‌మ‌స్య‌లు త‌లెత్తి.. వివాదం పెద్ద‌దిగా మారి.. అత‌డి సినిమాలేవీ విడుద‌ల కాని ప‌రిస్థితి నెల‌కొంది. ఎంత‌కీ తెగ‌ని ఈ వ్య‌వ‌హారం ఈ మ‌ధ్యే ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లుంది. గౌత‌మ్ ఒక నిర్మాత‌ను ప‌ట్టుకుని త‌న సినిమాల్ని బ‌య‌టికి తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ధ‌నుష్‌తో తీసిన ఎన్నై నొక్కి పాయుం తోటాను ఈ నెల 29న విడుద‌ల‌కు సిద్ధం చేశాడు. విక్ర‌మ్‌తో తీస్తున్న ధృవ‌న‌క్ష‌త్రం కూడా త్వ‌ర‌లోనే బ‌య‌టికొస్తుంద‌ని ప్ర‌క‌టించాడు.

వీటి క్లియ‌రెన్స్ త‌ర్వాత కొత్త సినిమాల్ని ప‌ట్టాలెక్కించ‌డానికి గౌత‌మ్ స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. అత‌ను సూర్య‌తో ఓ సినిమా చేయ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో పాటు అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తాడ‌ని కూడా అంటున్నారు. అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో గౌత‌మ్ స్ట‌యిల్లో ఒక యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చేస్తే అదిరిపోతుంది. చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించే కాంబినేష‌న్ ఇది. ఇంత‌కుముందు గౌత‌మ్ తీసిన ఎన్నై అరిందాల్‌లో అనుష్క క‌థానాయిక‌గా న‌టించింది. అప్ప‌ట్నుంచే ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తీయాల‌న్న ఆలోచ‌న‌తో ఉన్నాడు గౌత‌మ్. అనుకున్న‌ట్లే గౌత‌మ్ స‌మ‌స్య‌ల‌న్నీ తీరి.. అత‌డి సినిమాల‌న్నీ బ‌య‌టికొచ్చి అనుష్క‌తో సినిమా తీసి ప్రేక్ష‌కుల‌కు ఒక కొత్త అనుభూతిని అందిస్తాడేమో చూద్దాం.