Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విరుష్క పెళ్లిసంగతులు ముగియగానే వారి హనీమూన్ విశేషాలపై చర్చ మొదలయింది. వారిద్దరూ హనీమూన్ ఎక్కడ గడుపుతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో అనుష్క తాము ఎక్కడున్నామన్న విషయం మాత్రం చెప్పకుండా మంచుకొండల్లో దిగిన ఓ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. భర్త కోహ్లీతో కలిసి దిగిన ఆ సెల్ఫీకి స్వర్గంలో…నిజంగా అని కామెంట్ పెట్టింది. ఈ ఫొటో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. వారి హనీమూన్ కు సంబంధించి బయటికి వచ్చిన తొలి ఫొటో ఇదే. అటు విరుష్క జోడీకి ప్రముఖుల శుభాకాంక్షలు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో విరాట్ కు సహచరుడు, దక్షిణాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ విరుష్కను అభినందనల్లో ముంచెత్తాడు. తన అధికారిక యాప్ లో శుభాకాంక్షల వీడియోను పోస్ట్ చేశాడు.
పెళ్లిచేసుకున్నందుకు విరాట్, అనుష్కలకు అభినందనలని, వారిద్దరూ తనను ఆశ్చర్యానికి గురిచేశారని, అయితే ఏదో ఒక రోజు ఇలా చేస్తారని అనుకున్నానని డివిలియర్స్ అన్నాడు. మంచి స్నేహితుడికి అభినందనలని, ఆనందకరమైన జీవితం కొనసాగిస్తారని, ఎక్కువమంది పిల్లల్ని కంటారని ఆశిస్తున్నానని వీడియోలో అభినందనలు తెలిపాడు. పాక్ వివాదాస్పద బౌలర్ మహ్మద్ ఆమీర్ కూడా కోహ్లీకి అభినందనలు తెలియజేశాడు. పాక్ లోని ఖలీజ్ టైమ్స్ తో ఆమిర్ మాట్లాడాడు.
కోహ్లీ పెళ్లిచేసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమిర్ చెప్పాడు. అతని కొత్త జీవితం బాగుండాలని, క్రికెట్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నట్టే నూతన జీవితంలో విజయవంతమవ్వాలని ఆకాంక్షించాడు. చాలామంది దృష్టి వారి మీద ఉన్నట్టే దిష్టికళ్లూ వారిపై ఉంటాయని, అలాంటి కళ్లనుంచి వారిని కాపాడాలని అల్లాను ప్రార్థిస్తున్నానని ఆమిర్ చెప్పాడు. ఆమిర్ కోహ్లీని ఎంతగానో అభిమానిస్తాడు. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో ఐదేళ్లపాటు నిషేధానికి గురైన అనంతరం ఆమిర్ జాతీయ జట్టులో పునరాగమనం చేయడాన్ని సొంతదేశస్థులే వ్యతిరేకించగా కోహ్లీ మాత్రం మద్దతిచ్చాడు. ఆమిర్ తప్పు తెలుసుకున్నాడని, మరోసారి అలాంటి పనిచేయడని సానుకూలంగా మాట్లాడాడు. అప్పటినుంచి ఆమిర్ కోహ్లీని తన ఇంటర్వ్యూలో తప్పకుండా ప్రస్తావిస్తాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్ అని కొనియాడుతుంటాడు.