30 ప్లస్‌లోకి వచ్చారంటే చాలామంది హీరోయిన్ల కెరీర్ ముగిసిపోతుంటుంది. అప్పటికి సినిమాలు ఉన్నా అంతకుముందున్న స్థాయిలో మాత్రం ఉండవు. హీరోయిన్లు ఆ వయసులో ఒక రేంజ్ మెయింటైన్ చేయడమంటే కష్టమే. కానీ అనుష్క శెట్టి మాత్రం 30 ప్లస్‌లోనూ భారీ సినిమాలు చేసింది. తిరుగులేని విజయాలందుకుంది.
బాహుబలి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు అనుష్క నుంచి వచ్చింది 30 ప్లస్‌లోనే కావడం విశేషం. ఐతే ‘భాగమతి’ తర్వాత అనుష్క కొంత కాలం కనిపించకుండా పోయింది. గ్యాప్ తీసుకుని ‘నిశ్శబ్దం’ సినిమాలో నటించింది. దీని తర్వాత మరే చిత్రానికీ కమిట్మెంట్ ఇచ్చినట్లు అధికారిక సమాచారం అయితే బయటికి రాలేదు. మరి అనుష్క ఇంత స్లో ఎందుకైంది.. ఆమెకు ఆఫర్లు రావట్లేదా.. లేక తనే సినిమాలు వదులుకుందా అన్నది అభిమానులకు అర్థం కాలేదు.
ఐతే తన కొత్త చిత్రం ‘నిశ్శబ్దం’ అమేజాన్ ప్రైమ్‌లో డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిన నేపత్యంలో ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుష్క తన కెరీర్లో వచ్చిన గ్యాప్ గురించి, భవిష్యత్ ప్రాజెక్టుల గురించి మాట్లాడింది. వరుసగా భారీ చిత్రాలు చేయడంతో ‘భాగమతి’ పూర్తయ్యే సమయానికి బాగా అలసిపోయానని.. దీంతో విశ్రాంతి అవసరమని భావించే కొంత కాలం పాటు సినిమాలు చేయలేదని ఆమె తెలిపింది.
ఆ ఖాళీలో, ఆపై షూటింగుల్లేని గత ఆరు నెలల్లో సమయాన్ని ఎంతగానో ఆస్వాదించినట్లు అనుష్క తెలిపింది. ‘నిశ్శబ్దం’ అనుష్క చివరి సినిమా కావచ్చని, ఆమె రిటైర్ కాబోతోందని, వ్యక్తిగత జీవితంలో స్థిరపడబోతోందని కొంత ప్రచారం నడుస్తుండగా.. దాన్ని పరోక్షంగా ఖండించింది అనుష్క. తాను ఈ మధ్య కొత్తగా రెండు సినిమాలు సంతకం చేశానని చెప్పిన అనుష్క.. వాటి గురించి తన కన్నా వాటి నిర్మాతలు చెబితే బాగుంటుందని, కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాలని చెప్పింది.