స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. భాగమతి తర్వాత ఆమె ఇంతవరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘అవును టాలీవుడ్‌లో సైతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది.
అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. నేను అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు.
ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.. కానీ నేను దురుసుగా ఉండటం వల్ల నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనుష్క సూపర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, మిర్చి వంటి కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అరుంధతితో మహిళ ఓరియంటెడ్ సినిమాలకు తీసిన అనుష్క ఆ తర్వాత జీరో సైజ్, భాగమతి వంటి సినిమాల్లో నటించింది. భాగమతి సినిమా తర్వాత స్వీటీ ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు.