టీడీపీలో మరో విషాదం…!

AP Chief Whip Palle Raghunatha Reddy Wife Passes Away
నందమూరి హరికృష్ణ మరణంతో తీవ్ర విషాదంలో మునిగిపోయిన తెలుగుదేశం శ్రేణులకి మరో విషాద వార్త వెలుగులోకి వచ్చింది. ఏపీ చీఫ్‌విప్‌ పల్లె రఘునాథరెడ్డి సతీమణి పల్లె ఉమ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఉమా దేవి బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆమె అరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అయితే మీడియా అంతా అప్పుడు హరికృష్ణ అంత్యక్రియల కార్యక్రమాల మీద ఫోకస్ చేయడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
palle-uma-dead
బాలాజీ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ పేరుతో ఉమాదేవి విద్యాసంస్థలను స్థాపించారు. దానిద్వారా నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది పిల్లలకు ఉమా దేవి ఉచితంగా విద్య అందించారు. ఆమె చేసిన సేవ రఘునాథరెడ్డికి రాజకీయంగానూ ఉపయోగపడింది. 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో రఘునాథరెడ్డికి మద్దతుగా ఆమె ప్రచారం కూడా నిర్వహించారు. ఉమా దేవి మృతితో అనంతపురంలోని పుట్టపర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రికి వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లె రఘునాథరెడ్డిని పరామర్శించారు. సీఎంతో ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉన్నారు. ఉమా దేవి మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
palle-uma