కన్నడ సీఎం కోసం ప్రచారం చేయనున్న ఏపీ సీఎం !

నిన్నటి వరకూ ఈసీ మీద ఈవీఎంల విషయంలో పోరాడుతూ వచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నేడు కర్ణాటక వెళ్లనున్నారు. అక్కడ ఆయన జేడీఎస్ అభ్యర్ధి, ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడ కోసం ప్రచారంలో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాండ్యాలో రోడ్ షోను నిర్వహించనున్నారు. మాండ్యాలో దేవెగౌడ మనవడు, ప్రస్తుత సీఎం కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్ గౌడ, దివంగత అంబరీశ్ సతీమణి, సీనియర్ నటి సుమలత ప్రధాన పోటీదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. దేవెగౌడ ఆహ్వానం మేరకు కర్ణాటక వెళ్లి, జేడీ (ఎస్)కు అనుకూలంగా ప్రచారం నిర్వహించనున్న చంద్రబాబు, నేడు మాండ్యాలో నిఖిల్ కు ఓటేయాలని అభ్యర్థించనున్నారు. నేడు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి మైసూరు బయలుదేరనున్న చంద్రబాబు, సాయంత్రం 4 గంటల సమయంలో మాండ్యా చేరుకుంటారు. ఆయన అక్కడ పాండవపుర అనే ఊరిలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. అక్కడ తెలుగు ఓటర్లు ఎక్కువ ఉండడంతో ఆయన సభ అక్కడే ఏర్పాటు చేశారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో దేవెగౌడ, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే చంద్రబాబును తమ రాష్ట్రంలో ప్రచారానికి రావాలని దేవెగౌడ కోరగా, అందుకు చంద్రబాబు అంగీకరించారు.