మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా నవ యుగానికి నాంది పలికిన వైతాళికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విజయవాడ ఆర్ అండ్ బీ భవనంలోని మీడియా పాయింట్‌లో ఆదివారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు రాజకీయ, నామినేటెడ్ పదవులు, ఆర్థిక, సామాజిక రంగాల్లో అర్థ భాగం రాసిచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను ప్రతి మహిళ సోదరుడిగా ఆదరించి తమ మనసులోనే రాఖీ కట్టి అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్‌లకు ఆడబిడ్డలు గుర్తు లేరని, అధికారం పోయాక ఇప్పుడు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అడపాదడపా ఏదో ఒక శాంతిభద్రతల సమస్య వస్తుంటుందని.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే నేరాలు, ఘోరాలు జరిగిపోతున్నట్టు ప్రతిపక్షం రాద్ధాంతం చేయడం తగదని అన్నారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం 2014 –2019 మధ్య రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి,ఎన్ని కేసులు పెట్టారు.
ఎంతమంది మహిళలకు న్యాయం చేశారనే అంశాలపై చంద్రబాబు, లోకేశ్, టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆమె ప్రశ్నించారు.ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 2020–2021లో గతం కంటే 4 శాతం నేరాలు తగ్గాయని వివరించారు. మహిళలపై ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేస్తున్నారని, వీలైనంత త్వరగా చార్జిషీట్ వేసి దోషులకు శిక్షలు పడేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వివరించారు. దిశ చట్టం ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఆమోదం కోసం ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తేవాలని కోరారు. మహిళా కమిషన్ డైరెక్టర్ సూయిజ్, అధికారులు పాల్గొన్నారు.