జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సీఎం జగన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు.
రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు.వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది.
అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటారు.