పోలవరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏరియల్ సర్వే ద్వారా పోలవరం ప్రాజెక్టు పనులను వీక్షించారు. అధికారులతో కలిసి సీఎం జగన్ క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి సీఎం స్వయంగా పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్ట్ పనుల పురోగతిని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు.అనంతరం సీఎం జగన్ పోలవరం నిర్వాసితులతో మాట్లాడారు.
స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్‌ను సీఎం వైఎస్ జగన్ పరిశీలించి, అనంతరం పోలవరం పనుల ఫొటో గ్యాలరీని వీక్షించారు. సీఎం జగన్‌తో పాటు నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, అధికారులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా మధ్యాహ్నం అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. గడువులోగా పోలవరం పనులు పూర్తిచేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం సీఎం జగన్ పోలవరం పర్యటన ముగించుకొని తాడేపల్లికి బయలుదేరారు.