ఏపీ ఆర్ధిక శాఖ కార్యదర్శి ఆకస్మిక సెలవు…అందుకేనా ?

ఇన్నాళ్లూ చంద్ర‌బాబు నాయుడి ముఖ్యమంత్రిగా ఉండగా ఉన్న రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్య‌ద‌ర్శి మ‌ద్దాడ ర‌విచంద్ర‌ సెలవు పెట్టడం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏప్రిల్ 22నుంచి వచ్చే నెల 25 వరకు రవిచంద్ర సెలవు పెట్టారు. దీంతో ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్‌కు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇంత హఠాత్తుగా ఎందుకు సెలవు పెట్టారనే విషయంపై ప్రభుత్వ వర్గాల్లో, పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఆర్థిక శాఖ వ్యవహారాలపై రెండు రోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. శాఖలోని వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పసుపు కుంకుమ, అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి నిధులపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆరా తీశారు. పసుపు కుంకుమ స్కీమ్‌తో రూ. 9వేల కోట్లు, అన్నదాత సుఖీభవకు రూ. 4 వేల కోట్లు, నిరుద్యోగ భృతికి వేల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంది. దీంతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడుతోంది. అయితే ఆర్థిక వ్యవహారాలపై సమీక్ష నిర్వహించిన సీఎస్. ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులపై అనేక ప్రశ్నలు వేశారు. ఎల్వీసుబ్రహ్మణ్యం సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి ఆర్ధిక శాఖలో జరుగుతున్నవ్యవహారాలపై ఆరా తీస్తూనే ఉన్నారు. ఎన్నికలకు ముందు విడుదల చేసిన బిల్లులపై కూడా సుబ్రహ్మణ్యం రవిచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఎస్. స్వయంగా సమీక్ష నిర్వహించడంతో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిచంద్ర అసంతృప్తికి లోనయ్యారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఇటీవల సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యకు, రవిచంద్రకు మధ్య గ్యాప్ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రానికి ఆదాయం అంతంత మాత్రమే ఉండగా స్కీమ్ లకు ఎలా నిధులు ఖర్చు చేస్తారంటూ కూడా ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ అండదండలు ఉన్న రవిచంద్ర సెలవు పెట్టినట్లు తెలుస్తోంది.