ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ap government good news for auto and cab drivers

ఏపీ  ప్రభుత్వం  ఆటో, క్యాబ్ డ్రైవర్లకుశుభవార్త చెప్పింది. త్వరలోనే ఓనర్ కమ్ డ్రైవర్లకు రూ.10వేలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. మంగళవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో.. ఈ మేరకు రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ఓ ప్రకటన చేశారు. ఆటో డ్రైవర్లకు సంబంధించి.. టీడీపీ సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.రాష్ట్రంలో మూడు చక్రాల ఆటో రిక్షా యజమానులకు సమగ్ర బీమాను సమకూరుస్తామని చెప్పారని అడగగా దానికి అవునని మంత్రి సమాధానం చెప్పారు. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌ను ఆటో డ్రైవర్లు కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారని.. 2018 మే1న మూడు చక్రాల ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫిటినెస్, ఇన్స్యూరెన్స్‌తో పాటూ మరికొన్ని ఖర్చులు ఆటో డ్రైవర్లకు భారంగా ఉందని.. వాళ్ల కష్టాల్ని ఆదుకునేందుకు ప్రతి ఓనర్ కమ్ డ్రైవర్లకు ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీని మాటలకు పరిమితం చేయకుండా మేనిఫెస్టోలో పొందుపరిచామన్నారు మంత్రి నాని. మాట చెబితే జగన్ అమలు చేస్తారని.. మేనిఫెస్టోలో పొందుపరచడమే కాకుండా.. బడ్జెట్‌లో కూడా రూ.400కోట్లు కేటాయించారన్నారు.ఇచ్చిన మాట కోసం నిలబడ్డామని.. రూ.400కోట్లు కంటే ఎక్కువ ఖర్చు అయినా సీఎం ఇస్తామన్నారని గుర్తు చేశారు. తాము రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్ల సమాచారం సేకరించామని.. ఒకవేళ ప్రభుత్వ అంచనాల కంటే ఎక్కువమంది ఉన్నా.. వారికి కూడా, ఎంతమంది ఉన్నా ఇస్తామన్నారు.