నిన్న ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వైసీపీ బృందం టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని ఇందులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పాత్ర ఉందంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబుతో రిటైర్డ్ అధికారి సత్యనారాయణ లాలూచీ పడి ఆధార్ డేటాను లీక్ చేసి దీనిని ఈ-ప్రగతికి అందజేశారని విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ఏబీ వెంకటేశ్వరరావు కుమారుడు, డీజీపీ వ్యక్తులు కలిసి ఈ సంస్థలను స్థాపించారని ఆరోపించిన విజయసాయి, అధికారిక డేటాను ఆయా సంస్థలకు మళ్లించారని విమర్శలు గుప్పించారు. ఈ-ప్రగతి పేరుతో వందల కోట్లు దుర్వినియోగం చేశారని, చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును జైలుకు పంపేందుకు ఈ ఒక్క కేసు చాలని అన్నారు. దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని త్వరలోనే బయపడతాయని స్పష్టంచేశారు. విజయసాయిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు స్పందించారు. ఆయనపై పరువు నష్టం దావా వేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ-ప్రగతితో తమ కుటుంబ సభ్యులకు సంబంధాలున్నాయని విజయసాయి చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. తన కుటుంబ సభ్యులకు వాటితో ఎలాంటి సంబంధం లేదని నిరాధార ఆరోపణలు చేసిన విజయసాయి మీద పరువు నష్టం దావా వేస్తానని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.