నాగార్జునసాగర్ వివాదం మరింత ముదురుతోంది. ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు నిన్న కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు అందుకు రివర్స్ లో తెలంగాణ పోలీసులపై ఏపీ పోలీసులు కేసు పెట్టారు. తమ విధుల్ని అడ్డుకుంటున్నారంటూ ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులు చేసిన ఫిర్యాదుల్ని అనుసరించి పల్నాడులోని విజయపురి PSలో సెక్షన్ 447, 341, రెడ్ విత్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉండగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సాగర్ ప్రాజెక్టు 13 గేట్లను ఆధీనంలోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురాలోచనతోనే ఏపీ ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని విమర్శించారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే రాష్ట్రాల సంబంధాలు దెబ్బతింటాయన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉండే హక్కుల్ని కేంద్రం చేతుల్లోకి వెళ్లేలా ఏపీ కుట్ర చేసిందని ఆరోపించారు.