తిరుమల భక్తులకు అలర్ట్. శ్రీవారి సర్వదర్శనానికి ఇవాళ పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తున్నారు. శనివారం రోజున వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్-2, నారాయణ గిరి షెడ్లు నిండిపోయాయి. క్యూలైన్, నారాయణగిరి అతిథి గృహం వరకు చేరుకుంది. దీంతో వైకుంఠద్వార దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టోకెన్లు లేని వారిని దర్శనానికి అనుమతించడం లేదు.
రేపటి సర్వదర్శన టికెట్లు కలిగిన వారిని సాయంత్రం క్యూ లైన్లలోకి పంపిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని తొలుత ప్రకటించింది. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో రాత్రి నుంచే టోకెన్లు జారీ చేయడం మొదలు పెట్టింది. తితిదే ఇప్పటికే రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది.