వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్పై అంగన్వాడీలు సమరశంఖాన్ని పూరించారు. వారిని అణగదొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్మా ప్రయోగాన్నీ ఖాతరు చేయకుండా..ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు తగ్గేదేలేదని ఇప్పటికే తేల్చి చెప్పిన అంగన్వాడీలు తుది పోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. అంగన్వాడీల పోరాట పటిమ ఎలాంటిదో జగన్కు తెలియనట్లుందని, దాన్ని రుచి చూపిస్తామని స్పష్టం చేశారు. దీనికి ప్రజల మద్దతు కూడగట్టేందుకు సమాయత్తమవుతున్నారు. తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపకుండా ముఖ్యమంత్రి జగన్ అనుసరిస్తున్న దుర్మార్గ వైఖరిని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. మంగళవారం నుంచి ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే వాటిని సిద్ధం చేశారు.
‘అంగన్వాడీలు 30-40 ఏళ్లుగా పేద గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలకు ఎన్ని కష్టాలతో సేవలందిస్తున్నారో మీకు తెలుసు. నెలకు రూ.300 వేతనం నుంచి అనేక ఏళ్లుగా పనిచేస్తున్నాం. నాలుగైదు నెలలు జీతాలు రాకపోయినా పని చేశాం. కేంద్రాల అద్దెలు ఏళ్ల తరబడి చెల్లించకుండా ఆలస్యం చేసినా…గ్రామ, పట్టణ ప్రజల సహకారం వల్లే పనిచేయగలిగాం . ఇప్పుడు పెరిగిన ధరలతో బతకడం కష్టంగా మారింది. ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని నాలుగున్న రేళ్లుగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినే నాథుడే లేరు. ఇక గత్యంతరం లేకే సమ్మె బాట పట్టాం . దీన్ని అణచివేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. శాంతియుతంగా సాగుతున్న సమ్మెపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.