‘దగా డీఎస్సీ వద్దు.. మెగా డీఎస్సీ ముద్దు’ .. వెంటనే 30 వేల ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులు విజయనగరంలో సోమవారం భారీఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోట నుంచి ర్యాలీగా వెళ్లి కోరాడ వీధిలో ఉన్న విద్యా శాఖ మంత్రి బొత్స సత్య నారాయణ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. పోలీసులు నిలువరించడంతో తోపులాట జరిగింది. పోలీసులు కొందరిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించి ఒకటో పట్టణ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్కరాజు రామారావు మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న జగన్మోహన్రెడ్డి.. ఇప్పుడు మాట తప్పారని, నిరుద్యోగులను మోసగించారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
మెగా డీఎస్సీ ద్వారా 30 వేల పోస్టులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విజయనగరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పైడి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గోగాడ శ్రీనివాస్, తోడేటి సందీప్ ఐశ్వర్, సుశీల్‌కుమార్, ప్రధాన కార్యదర్శులు బట్టు శ్రీకాంత్, రామ్ సింగ్, కూన సరస్వతి, జిల్లా ఉపాధ్యక్షులు కె.కృష్ణారెడ్డి, కుర్మి నాయుడు తదితరులు పాల్గొన్నారు.