సామాజిక సమీకరణాల్లో భాగంగా తాను శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు మంత్రి ఉష శ్రీచరణ్ వెల్లడించారు. అనంతపురంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘సామాజిక సమీకరణాల్లో భాగంగా నేను ఈసారి పెనుకొండ నుంచి పోటీ చేయాలని అధిష్ఠానం నిర్ణయించింది. సీఎం జగన్ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని సీట్ల సర్దుబాటు చేస్తున్నారు. కళ్యాణదుర్గం నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అక్కడి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. కళ్యాణదుర్గంలో ఈసారి వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం రానుంది. అభ్యర్థి ఎవరనేది సీఎం జగన్ నిర్ణయిస్తారు. నేతలు ఎవరెక్క డికి వెళ్లి పోటీ చేసినా.. సీఎం జగన్ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారు’’ అని ఉష శ్రీచరణ్ ధీమా వ్యక్తం చేశారు.
పెనుకొండ వైకాపాలో అలజడి..
మరోవైపు పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి మార్పుపై వైకాపాలో అలజడి మొదలైంది. పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా శంకరనారాయణను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. రొద్దం మండలం ఎంపీపీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పలువురు సర్పంచులు ఎంపీటీసీలు సమావేశం నిర్వహించారు. మంత్రి ఉష శ్రీచరణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.