వ్యూహం సినిమాను ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్లో విడుదల చేయొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. దర్శకుడు రామ్గోపాల్వర్మ తీసిన ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని, చంద్రబాబును అపఖ్యాతిపాలు చేసే విధంగా చిత్రీకరించారని సిటీ సివిల్ కోర్టులో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన న్యాయస్థానం మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. రామదూత క్రియేషన్స్, దర్శకుడు రామ్గోపాల్వర్మకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేసింది.
తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం:
వ్యూహం సినిమాకు ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను రద్దు చేయాలని కోరుతూ లోకేశ్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. సినిమా విడుదల చేయకుండా చిత్ర నిర్మాతను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు ఈనెల 26న విచారించనుంది. ‘వ్యూహం ’ ట్రైలర్ విడుదల సమయంలో దర్శకుడు తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు, పవన్కల్యాణ్ నచ్చరని చెప్పారని లోకేశ్ పిటిషన్లో పేర్కొన్నారు. జగన్మోహన్రెడ్డి తెరవెనక ఉండి ఈ సినిమా తీయించారని పేర్కొన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ప్రాంతీయ కార్యాలయం, రివైజింగ్ కమిటీ, రామదూత క్రియేషన్స్, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, దర్శకుడు రామ్గోపాల్ వర్మను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు.