అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుసని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ గత 26 రోజులుగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ ప్రభుత్వ చర్యలను నియంత పోకడలకు పరాకాష్ఠగా అభివర్ణించారు. జీవో నెం.2ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల ఉద్యమానికి తెదేపా పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అంతిమంగా ఉద్యోగులే విజయం సాధిస్తారని అన్నారు.