‘అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్వాడీ సమస్యలపై దృష్టి పెట్టండి’ అని తెదేపా అధినేత చంద్రబాబు సూచించారు. న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమన్నారు. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా జీతాలు, చెల్లింపులు లేవని.. వివిధ ఆంక్షలు పెట్టి సంక్షేమ పథకాలకు వైకాపా ప్రభుత్వం కోతలు పెట్టిందని విమర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ఎన్ఆర్ఐ తెదేపా కార్యకర్త యష్ను అరెస్టు చేయడం సరికాదన్నారు.
‘‘పోలీసులను ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి పంపి యష్ను అరెస్టు చేయించారు. అలాంటిది అంగన్వాడీ సమస్యల పరిష్కారానికి సమయం లేదా? అక్రమ కేసులు, నోటీసులు, ప్రజలను వేధించడానికి సమయం వెచ్చిస్తున్నారు. దానిని సమాజానికి సేవ చేస్తున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించాలి’’ అని చంద్రబాబు అన్నారు.