‘రాజధాని ఫైల్స్ ’ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం .. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) జారీ చేసిన ధ్రువపత్రం సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉందని ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈ నెల 15న జారీచేసిన ఉత్తర్వులను పొడిగించలేమని తేల్చి చెప్పింది. ప్రతివాదులు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కి వాయిదా వేసింది.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.జయసూర్య శుక్రవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చేందుకు రాజధాని ఫైల్స్ సినిమా తీశారని, గతేడాది డిసెంబర్ 18న సీబీఎఫ్సీ జారీచేసిన ధ్రువపత్రాన్ని రద్దు చేయాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యా యమూర్తి.. సినిమాకు ధ్రువపత్రం జారీచేసే క్రమంలో రివైజింగ్ కమిటీ నిబంధనల ప్రకారం కారణాలను పేర్కొందా లేదా అనే విషయంపై రికార్డులను పరిశీలించాలని, వాటిని ఈ నెల 16న తమ ముందు ఉంచాలని గురువారం ఆదేశించారు. ఈలోపు చిత్ర ప్రదర్శనపై తాత్కాలిక స్టే ఇచ్చారు.