గత సార్వత్రిక ఎన్నికల్లో బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోమవారం సొంతూరు కారంచేడులో నిర్వహించిన మాటామంతీ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడి దయ వల్ల ఆ ఎన్నికల్లో నేను ఓడిపోవటమే మంచిదైంది. నేను గెలిచి ఉంటే రోడ్డు వేయలేదని ప్రజలు నన్ను నిలదీసేవారు. ప్రజలు ఓట్లేసి నన్ను గెలిపించి ఉంటే నేను ఇప్పుడు ఈ రోడ్లమీద ఇలా తలెత్తుకు తిరిగి ఉండగలిగేవాణ్నా ’ అని వ్యాఖ్యానించారు. వైకాపా పాలనలో రహదారులకు కనీసం మరమ్మతులు కూడా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భగవంతుడు తన మంచి కోరి, తన వ్యక్తిత్వం గుర్తించే తనను ఓడించి మంచి చేశాడని ఆయన పేర్కొన్నారు.
జగన్ నిబంధనలకు మేం తలొగ్గలేదు..
‘నేను ఓడిన రెండు నెలలకు జగన్ పిలిచారు. మా అబ్బాయిని ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తామన్నారు. ఆక్రమంలో జగన్ పెట్టిన నిబంధనలకు మా అబ్బాయి తలొగ్గలేదు. మనం ఇక్కడ ఇమడలేమనుకుని రాజకీయాలొద్దు.. వెళ్లిపోదాం.. కారు హైదరాబాద్ వైపు తిప్ప మని చెప్పి తిరస్కరించి వచ్చేశాం. ఇవాళ రాజకీయాలంటే పరస్పర విమర్శలు.. ప్రతి విమర్శలే. నేతలు పరస్పరం తిట్టుకోవటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదు. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నో చూశా. మనకు అవకాశం వచ్చి నప్పుడల్లా అభివృద్ధి పనులు చేయాలి. నా గ్రామాన్ని (కారంచేడును) అభివృద్ధి చేయటమే నాకు ఆత్మ సంతృప్తినిస్తుంది. మంత్రి పదవులు చేశాం. మాకు ఇంకేం కావాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 నియోజకవర్గాలు తెలుసు. సమస్యల పరిష్కారం కోరుతూ నా వద్దకు వస్తే సాధ్యమైనత వరకు వెంటనే పరిష్కరించి పంపటమే తప్పనాన్చటం తెలియదు. నన్ను నడిపించేది భగవంతుడే. ఏ పని చేసినా తప్పులేదు. ప్రస్తుతం నా మనవళ్లతో సంతోషంగా గడుపుతున్నాను’ అని దగ్గుబాటి చెప్పారు. భాజపా అధికారంలో లేనప్పుడే తన భార్య పురందేశ్వరి ఆ పార్టీలోకి వెళ్లారని గుర్తుచేశారు.