యువ గళం పాదయాత్రలో దినదిన ప్రవర్ధమానంగా, నాయకునిగా ఎంతో ఎత్తుకు ఎదిగిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రజా సమస్యలను ఆకలింపు చేసుకోవడంలో సక్సెస్ అయ్యారని రఘురామకృష్ణ రాజు అన్నారు. తొలుత మందకోడిగా సాగిన యువ గళం పాదయాత్రను సాక్షి యాజమాన్యం హేళన చేసిందని, అయినా ఆయన పట్టుదలతో ప్రజలతో మమేకమయ్యారని, బహిరంగ సభలలో మాత్రమే కాక, వివిధ వర్గాల వారితో ప్రత్యేకంగా సమావేశాలను నిర్వహించి వారి సమస్యల గురించి ప్రత్యేకంగా చర్చించారుని తెలిపారు.
అధికారంలోకి వస్తే ఏమి చేయగలమో, ఏమి చేస్తామో ప్రజలకు స్పష్టంగా వివరించారని, రాయలసీమ ప్రాంతంలో పరిమిత నీటి వనరులు ఉన్నచోట ఆ నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ… తుంపర సేద్యాన్ని ప్రోత్సహిస్తామని రైతులకు చెప్పారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తుంపర సేద్యాన్ని ప్రోత్సహించారని, కానీ ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా ప్రభుత్వం తుంపర సేద్యాన్ని మటాష్ చేసిందని అన్నారు. పామాయిల్ రైతులతో కూడా నారా లోకేష్ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారని అన్నారు.