రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పర్యటనకు మహిళా కార్మికులను పంపలేదనే కారణంతో పరిశ్రమలకు అధికారులు విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో.. ఆరు గంటల పాటు ఉత్పత్తి స్తంభించింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి సోమవారం పర్యటించారు. తూముకుంట, చౌళూరు, సంతేబిదనూరు, గోళ్లాపురం గ్రామాల్లో మంత్రి పర్యటనకు పరిశ్రమల్లో పనిచేసే మహిళా కార్మికులను పంపాలని ముందురోజు స్థానిక వైకాపా నాయకులు యజమానులకు హుకుం జారీచేశారు. దీనికి వారు అంగీకరించలేదు. దీంతో సోమవారం విద్యుత్తు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పారిశ్రామికవాడలకు విద్యుత్తు నిలిపివేయించారు. చేసేదిలేక, యజమానులు కార్మికులను ఐదు బస్సుల్లో మంత్రి పర్యటనకు పంపించారు. ఆ వెంటనే విద్యుత్తు పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం సరఫరాలో అంతరాయం వల్లే విద్యుత్తు నిలిపివేయాల్సి వచ్చిందని చెబుతున్నారు.