‘తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సంక్రాంతి వరకు గడువు ఇస్తున్నాం . అప్పటికీ స్పందించకపోతే.. పండగ తర్వాత తాడోపేడో తేల్చుకుంటాం . సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడించి తీరతాం . సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదు. రాజధాని గ్రామాల్లో సీఆర్డీఏ అధికారులను తిరగనివ్వం ’ అని అమరావతి రైతులు రాష్ట్ర ప్రభుత్వా న్ని హెచ్చరించారు. సీపీఐ, రాజధాని రైతు ఐకాస ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని సీఆర్డీఏ ప్రధాన కార్యా లయం వద్ద ఆందోళన నిర్వహించారు. వార్షిక కౌలు, రిటర్నబుల్ ప్లాట్ల అభివృద్ధి, నిరుపేదలకు ఇచ్చే పింఛను పెంపు తదితర డిమాండ్లపై సీఆర్డీఏ కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, రైతు కూలీలు, సీపీఐ నేతలు కె.రామకృష్ణ, ముప్పాళ్ల రామకృష్ణ, అజయ్‌కుమార్ తదితరులు సోమవారం సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు కార్యాలయం ప్రధాన గేటును మూసివేశారు. దీంతో వారు రోడ్డుపైనే నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాము వస్తున్నామని తెలిసే సీఆర్డీఏ కమిషనర్ ఉద్దేశపూర్వకంగా కార్యాలయానికి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీపీఐ నేతలు.. అదనపు కమిషనర్ అలీం బాషా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చిరంజీవిని కలిసి వార్షిక కౌలు జాప్యంపై నిలదీశారు. తాము ఎప్పుడో రూ.190 కోట్లను సీఎఫ్ఎం ఎస్‌లో అప్లోడ్ చేశామని, ఆర్థిక శాఖ నుంచి ఆమోదం వస్తే నిధులు జమ అవుతాయని అధికారులు తెలిపారు. సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా వచ్చేలా చూస్తామని, అసైన్డ్ భూములపై విచారణ త్వరగా పూర్తి చేయమని సీఐడీకి లేఖ రాస్తామని, తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో సిబ్బంది సంఖ్యను పెంచుతామని అదనపు కమిషనర్ అలీం బాషా హామీ ఇచ్చారు.