గ్రామ పంచాయతీ పరిధిలో ఎవరు లేఅవుట్ వేసినా ఎకరాకు రూ.2 లక్షలు చెల్లించాల్సిందేనంటూ ఓ స్థిరాస్తి వ్యాపారిని అనంతపురం జిల్లాకు చెందిన వైకాపా నేత, ఉరవకొండ ఉపసర్పంచి బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫోన్లో బెదిరించిన ఆడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుమారుడు ప్రణయ్‌రెడ్డి ప్రధాన అనుచరుడైన వన్నప్పకు ఉరవకొండకు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ఫోన్ చేశారు. వార్డు సభ్యుడు అనధికార లేఅవుట్పై ప్రశ్నిస్తున్నారని.. పంచాయతీ కార్యదర్శిని పిలుచుకుని వచ్చి రాళ్లు పీకేయిస్తానంటున్నాడని తెలిపారు.
దీనిపై ఉపసర్పంచి వన్నప్ప స్పందిస్తూ ఈ వ్యవహారంతో వార్డు సభ్యులకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నేరుగా అధిష్ఠానం (విశ్వేశ్వరరెడ్డి, ప్రణయ్‌రెడ్డి) ఆదేశాల మేరకు డబ్బులు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రణయ్రెడ్డే అడగమన్నారా? అని వ్యాపారి ప్రశ్నించగా.. అవునంటూ వన్నప్ప చెప్పడం గమనార్హం. కళ్యాణదుర్గం , గుంతకల్లులో రూ.1.5 లక్షలు మాత్రమే వసూలు చేస్తున్నారంటూ వ్యాపారి చెప్పగా.. మిగతా వ్యాపారులందరికీ ఎకరాకు రూ.2 లక్షలు ఇవ్వాలని అడిగా.. మీరు చూసుకుని ఇవ్వండి అంటూ ఉపసర్పంచి సమాధానమిచ్చారు.