గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని అన్నా రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ప్రకటించారు. రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నట్లు అన్నా రాంబాబు వెల్లడించారు.
కాగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది. ఆ పార్టీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూడా గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అశోక్ రెడ్డి గెలుపొందారు. అయితే 2009లో ప్రజారాజ్యం తరపున అన్నా రాంబాబు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తాజాగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని అన్నా రాంబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే పేర్ని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పుడు అన్నా రాంబాబు సైతం అదే బాటలో నడుస్తున్నారు.