హైదరాబాద్లో ఇటీవల సంచలనం సృష్టించిన మాదకద్రవ్యాల(డ్రగ్స్) కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. తాజాగా నెల్లూరుకు చెందిన వైకాపా నేత, నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ కుమారుడు ముక్కాల ప్రేమ్ చందన్ ను ఏ-38గా చేర్చారు. నెల్లూరు పట్టణానికి చెందిన సాయిచరణ్, రాజేష్, అశిక్ యాదవ్లు ఎస్సార్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటూ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డారు. తరచూ వాటి కోసం గోవాకు వెళ్లేవారు. అక్కడ బాబా, ఎడ్విన్ వీరికి డ్రగ్స్ విక్రయించేవారు. అక్కణ్నుంచి తీసుకొచ్చి హైదరాబాద్తోపాటు నెల్లూరులో అధిక ధరకు అమ్మే వారు. ఈ క్రమంలో వైకాపా నేత కుమారుడు ప్రేమ్ చందన్ పుట్టిన రోజు వేడుకల కోసం పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు తెప్పించినట్లు గుర్తించిన టీఎస్ న్యాబ్ పోలీసులు ఈ నెల 16వతేదీ దాడులు నిర్వహించడంతో వ్యవహారంవెలుగులోకి వచ్చింది.
అయితే ఎఫ్ఐఆర్లో ఎక్కడా ప్రేమ్ చందన్ పేరు చేర్చకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పేరును వినియోగదారుల జాబితాలో చేర్చారు. డ్రగ్స్ వినియోగించిన వారిలో మరి కొంతమంది ముఖ్య నేతలు, వారి కుమారులు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గోవా నుంచి మాదక ద్రవ్యాలు తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తున్న అయిదుగురిలో అశిక్ యాదవ్, రాజేష్లను పోలీసులు గతంలో అరెస్టు చేశారు. పరారీలో ఉన్న బాబా, సాయిచరణ్, ఎడ్విన్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మాదకద్రవ్యాలు వినియోగించిన 33 మందిని ఇప్పటికే గుర్తించగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు పోలీస్ వర్గాల సమాచారం.