ప్రజల్లో వైకాపా ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని.. అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని.. ఎప్పుడూ లేనివిధంగా అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన సమీక్షకు జనసేన అధినేత పవన్‌కల్యా ణ్‌తో కలిసి ఆయన హాజరయ్యారు. సీఈసీ రాజీవ్‌కుమార్‌ను కలిసి రాష్ట్రంలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై ఫిర్యాదు చేశారు. అనంతరం నేతలిద్దరూ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశాం. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారు. తెదేపా, జనసేన నేతలపై సుమారు 6-7వేల కేసులు పెట్టారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారు. ఎన్నికల్లో ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారు. వైకాపా అరాచకాలను సీఈసీకి వివరించాం .ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలి. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచుతారా? బీఎల్వోలుగా 2,600 మంది మహిళా పోలీసులను నియమించారు. అవసరమైతే కేంద్ర పోలీసు పరిశీలకులను రాష్ట్రానికి పంపాలి. ప్రజాస్వామ్య పరిరక్షణకు మా ప్రయత్నాలన్నీ చేస్తాం . ఒక్క దొంగ ఓటు ఉన్నాఈసీ దృష్టికి తీసుకెళ్లేలా పనిచేస్తాం ’’ అని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలోనూ దొంగ ఓట్లు: పవన్
రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైకాపా అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సీఈసీకి వివరించారని పవన్ చెప్పారు.