AP Politics: ‘ఆడుదాం ఆంధ్రా’ బహిష్కరించిన వైకాపా కార్పొరేటర్లు

AP Politics: Vaikapa corporators who boycotted 'Audham Andhra'
AP Politics: Vaikapa corporators who boycotted 'Audham Andhra'

గుంటూరు జిల్లా నల్లపాడులో నిర్వహించనున్న ‘ఆడుదాం ఆంధ్రా’ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వైకాపా కార్పొరేటర్లు బహిష్కరించారు. సీఎం పర్యటన దృష్ట్యా లయోలా స్కూల్ వద్ద కార్పొరేటర్లను పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి అనుమతి లేదంటూ కార్యక్రమానికి పంపించేందుకు నిరాకరించారు. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేసిన కార్పొరేటర్లు అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోవైపు గుంటూరులో సీఎం జగన్ పర్యటనను వ్యతిరేకిస్తూ తెలుగుయువత, విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ చుట్టుగుంట కూడలిలో ధర్నా నిర్వహించారు. ఆడుదాం ఆంధ్రాకు వ్యతిరేకంగా అడుగుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ ఆడుదాం సరే.. ఆటస్థలాలు ఎక్కడ జగన్’ అంటూ నిలదీశారు. ప్రభుత్వ స్టేడియాలను నిర్వీర్యం చేసి, ప్రైవేటు విద్యా సంస్థలో ఆటలేంటని మండిపడ్డారు. నిరుద్యోగుల హామీలను గాలికొదిలేసి వారి జీవితాలతో ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. విద్యార్థి సంఘ నేతలపై కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు.

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి ‘ఆడుదాం ఆంధ్రా’ పేరిట క్రీడా పోటీలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. నల్లపాడులోని లయోలా పబ్లిక్ స్కూల్లో ముఖ్యమంత్రి జగన్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 10 వరకు 47 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.