తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిస్తే వైకాపా ఖాళీ అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కాపుతెంబూరులో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్పై విరుచుకుపడ్డారు. నాలుగున్న రేళ్లలో ముఖ్యమంత్రి 13లక్షల కోట్లు అప్పులు చేశారని, ఇందులో బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకిచ్చిన రూ.3 లక్షల కోట్లు తీసేస్తే మిగిలిన డబ్బంతా ఏం చేశారో సీఎం లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలకు తెదేపా ఎప్పుడూ అండగా నిలుస్తుందని, వైకాపా బీసీలకు ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నించారు. అంగన్వాడీ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులు మొదలుకొని జగన్ నియమించిన వాలంటీర్లు సైతం సమ్మె బాటపట్టారని అన్నారు. ‘వైకాపాకు లోక్సభలో 22 మంది, రాజ్యసభలో తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు. అదే లోక్సభలో నేనూ సభ్యుడిగా ఉన్నాను. ప్రజల సమస్యలపై ఎవరు ఎలా పనిచేస్తున్నారో బేరీజు వేసుకోవాలి’ అని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఒక్క నాడైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలపై వారు మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కణితి కిరణ్కుమార్, తెదేపా ముఖ్య నేతలు పాల్గొన్నారు. కార్యక్రమంలో కాపుతెంబూరుకు చెందిన వైకాపా నాయకులు కొల్లి హరిబాబు, పెద్దలవునుపల్లికి చెందిన కుశరాజుతోపాటు వారి అనుచరులు, మరో 10 గ్రామ పంచాయతీల నుంచి వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు.
తెదేపా సమర శంఖారావ ర్యాలీ
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మంగళవారం పసుపుమయంగా మారింది. కోటబొమ్మాళి నుంచి నందిగాం మండలం కాపుతెంబూరు వరకు తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విచక్రవాహన ర్యాలీకి విశేష స్పందన లభించింది. అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు పార్టీ శ్రేణులతో ముందుకు కదిలారు. ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ద్విచక్రవాహన ర్యాలీ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపింది. అనంతరం కాపుతెంబూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.