సొంత యంత్రాంగంగా ఉన్న వాలంటీర్లు జగన్ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమాన్ని వాలంటీర్లు బహిష్కరించారు. హిందూపురంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. హిందూపురం మున్సిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లను 2019 అక్టోబరులో నియమించింది. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వీరు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.
అంతేకాక ప్రభుత్వం తరఫున నిర్వహించే సర్వేల్లోనూ వీరినే భాగస్వాములను చేస్తున్నారు. సీఎం జగన్ పలు సందర్భాల్లో వాలంటీర్లు తమ సైన్యమని బాహాటంగానే చెప్పారు. అయితే ఆయన చెప్పినవన్నీ తీపి మాటలేనని గౌరవ వేతనం పెంచే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదన్న అసంతృప్తి వాలంటీర్లలో ఇటీవల బాగా ఏర్పడింది. పొరుగు సేవల సిబ్బంది, కాంట్రాక్టు కార్మికులకు ఇస్తున్న వేతనం కూడా తమకు ఇవ్వడం లేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయిన వీరు సమ్మెకు దిగారు.