ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ఎన్నికల్లో కలిసి వెళ్దామని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి సూచించినట్లు తెలిసిందని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. ఈ పొత్తుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆసక్తిని ప్రదర్శిస్తారని రాహుల్ గాంధీ గారు సొంత పార్టీ నేతలను ప్రశ్నించినట్లుగా తెలిసిందన్నారు. టీడీపీ, జనసేన పార్టీల మధ్య ఇప్పటికే పొత్తు కుదిరిందని, జనసేనకు ఇప్పటికే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతోందని తెలిపారు.
రానున్న ఎన్నికలకు ఈ మూడు పార్టీలు కలిసి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లు తెలుస్తోందని, కష్టం అనేది ఊరికే పోదని, చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు జైలు జీవితం అనుభవించి మహా కష్టాలను అనుభవించారని అన్నారు. నాలుగు ఏళ్లుగా తాను కూడా ఎన్నో కష్టాలను పడ్డానని, ఈ ప్రభుత్వంలో కష్టపడిన ప్రజలు ఎన్నికల తేదీ ఎప్పుడు వస్తుంది… పోలింగ్ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురుచూస్తూ ఉన్నారని తెలిపారు.