ఇవాళ్టితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగియనుంది. ఈరోజు 226వ రోజుకు చేరుకున్న ఈ యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. విశాఖ క్యాంప్ సైట్ నుంచి ఇవాళ పాదయాత్రను ప్రారంభించగా.. లోకేశ్ వెంట తల్లి భువనేశ్వరి, అత్త వసుంధర, ఇతర కుటుంబసభ్యులు, కార్యకర్తలు, అభిమానులు కదం తొక్కారు. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.
మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులు, మీ సేవా నిర్వాహకులతో ఇవాళ.. లోకేశ్ ముఖాముఖి నిర్వహించనున్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద సాయంత్రం స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రతినిధులతో భేటీ అవుతారు. ఇవాళ్టితో యువగళం పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో విశాఖ శివాజీనగర్‌లో పాదయాత్ర ముగింపు సందర్భంగా పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరిస్తారు. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర.. 97 నియోజకవర్గాల్లో విజయవంతంగా సాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈనెల 20వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లిలో యువగళం విజయోత్సవ సభను టీడీపీ భారీ ఎత్తున నిర్వహించనుంది. ఈ సభకు చంద్రబాబు నాయుడితో పాటు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం.