దేశంలో పొలిటికల్‌ హీట్‌

దేశంలో పొలిటికల్‌ హీట్‌

అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దేశంలో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్‌లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. యూపీ ఎన్నికల వేళ ములాయం కుటుంబానికి భారీ షాక్‌ తగిలింది. ములాయం చిన్న కోడలు అపర్ణా యాదవ్‌ బుధవారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, యూపీ బీజేపీ చీఫ్ స్వతంత్రదేవ్ సింగ్ సమక్షంలో అపర్ణ కమలదళంలో చేరారు. మౌర్య, స్వతంత్రదేశ్ ఆమెకు సభ్యత్వమిచ్చి, కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

నిజానికి అపర్ణ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరాల్సి ఉన్నా అది కుదరలేదు.కొన్నేళ్లుగా అపర్ణాతో టచ్‌లో ఉన్న బీజేపీ.. అపర్ణాను పార్టీలో చేర్చుకొని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ముగ్గురు ఓబీసీ మంత్రులు, ఏడుగురు ఎమ్మెల్యేలను చేర్చుకొని ఊపుమీదున్న సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీ రివర్స్‌ పంచ్‌ ఇచ్చింది. కాగా సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా కొడుకైన ప్రతీక్ యాదవ్ భార్య అపర్ణా యాదవ్.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ తరపున లక్నో నుంచి పోటీచేసి అపర్ణా ఓడిపోయారు. తాజా ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సామాజిక వర్గమైన ఠాకూర్ బిష్ట్ వర్గానికి చెందిన అపర్ణా యాదవ్‌.. తొలి నుంచి ప్రధాని మోదీ విధానాలపై సానుకూల వైఖరితో ఉండేవారు. ఎస్పీలో తమకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావనతోనే అపర్ణా బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.