భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్న యాపిల్‌

భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్న యాపిల్‌

ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ దేశీయంగా విస్తరణను చేపట్టనుంది. ఇందుకు భారీగా ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు కంపెనీ ప్రొడక్ట్‌ కార్యకలాపాల వైస్‌ప్రెసిడెంట్‌ ప్రియ బాలసుబ్రమణ్యన్‌ పేర్కొన్నారు. ఉద్యోగులు, యాప్స్, సరఫరా భాగస్వాములు, తదితరుల ద్వారా 10 లక్షల ఉద్యోగాల లక్ష్యానికి మద్దతివ్వనున్నట్లు 2021 బెంగళూరు టెక్‌ సదస్సు సందర్భంగా తెలియజేశారు.

రెండు దశాబ్దాలుగా యాపిల్‌ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆమె చెప్పారు. 2017లో బెంగళూరు యూనిట్‌లో ఐఫోన్ల తయారీని చేపట్టినట్లు ప్రస్తావించారు. ఆపై చెన్నైలోనూ తయారీ కార్యకలాపాలను విస్తరించినట్లు పేర్కొన్నారు. తద్వారా వివిధ ఐఫోన్‌ మోడళ్లను దేశ, విదేశీ మార్కెట్ల కోసం రూపొందిస్తున్నట్లు వివరించారు. కస్టమర్లను ఈ మోడళ్లు ఆకర్షి స్తాయన్న విశ్వాసాన్ని వక్తం చేశారు.

పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లడం ద్వారా నిధులను సమీకరించాలంటే కంపెనీలు సాధ్యాసాధ్యాల పరిశీలనకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుందని స్టార్టప్‌లకు ఐపీవో అవకాశాలు, సవాళ్లుపై నిర్వహించిన టెక్‌ సదస్సులో నజారా టెక్నాలజీస్‌ సీఈవో మనీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. ఇందుకు కంపెనీ నిర్వహణ తదితర పలు అంశాలపై క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పరిశీలనలోకి ప్రవేశించవలసి ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రమోటర్లు వాటా విక్రయం ద్వారా వాటాదారులకు విలువ చేకూర్చడం అనేది కాల్పనిక అంశమని అన్నారు.