ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌

ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ఐఫోన్‌ యూజర్ల కోసం కొత్తగా ట్యాప్-టు-పే ఫీచర్‌ను త్వరలోనే ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో తమ ఐఫోన్‌లను పేమెంట్ టెర్మినల్స్‌గా మార్చవచ్చునని యాపిల్‌ వెల్లడించింది. ఐఫోన్‌ యూజర్లు తమ ఐఫోన్‌లను ఉపయోగించి యాపిల్ పే, కాంటాక్ట్‌లెస్ క్రెడిట్,డెబిట్ కార్డ్‌, ఇతర డిజిటల్ వాలెట్‌లకు అదనపు హార్డ్‌వేర్ అవసరం లేకుండానే లావాదేవీలను జరపవచ్చునని యాపిల్‌ పేర్కొంది.

యాపిల్ ప్రవేశపెడుతున్న ఈ కొత్త ట్యాప్-టు-పే ఫీచర్ ఐఫోన్ ఎక్స్‌ఎస్‌, తదుపరి మోడళ్లలో అందుబాటులో ఉండనుంది. ఇది పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లు, యాప్ డెవలపర్‌లు వారి iOS యాప్‌లలో కలిసిపోవడానికి, వారి కస్టమర్‌లకు పేమెంట్ ఎంపికగా అందించడానికి మరింత సులువుగా ఉండనుంది. ఈ ఏడాది చివర్లో యూఎస్‌లోని మార్చంట్స్‌, యాపిల్‌ స్టోర్లలో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్, డిస్కవర్, మాస్టర్ కార్డ్ , వీసా వంటి కార్డులతో సహా ఇతర పేమెంట్‌ యాప్స్‌తో కాంటాక్ట్‌లెస్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ట్యాప్-టు-పే ఫీచర్ పని చేస్తుందని యాపిల్‌ తెలిపింది.

యాపిల్ సంస్థ కొత్తగా ప్రవేశపెట్టనున్న ట్యాప్-టు-పే ఫీచర్ NFC టెక్నాలజీ సహాయంతో పనిచేయనుంది. ఇక యూజర్ల గోప్యత విషయంలో యాపిల్ ఐఫోన్లలో ట్యాప్-టు-పేతో యాపిల్ పేని సురక్షితంగా ఉంచడానికి ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కస్టమర్ల పేమెంట్ డేటా సురక్షితంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్‌ తొలుత అమెరికాలో రానుండగా.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు ఇది ఎప్పుడు వస్తుందనే దానిపై ఎటువంటి సమాచారం లేదు.