అందం అంటే అందరికీ ఆరాటమే. ఎన్నేళ్లు ఒంటిపైకి ఎగబాకిన అందంగా కనపడాలనే కోరిక మాత్రం చావదు. అందుకే అందంగా కనపడేందుకు అందవిహీన పనులు కూడా చేస్తుంటారు కొందరు. ఏం చేసైనా సరే అందంగా కనపడాలనేదే వారి తాపత్రయం. మరీ ఏం చేద్దాం. అందంగా కనపడాలంటే తప్పదుగా మరీ అంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే సెలబ్రిటీలు అయితే బోర్ కొట్టించకుండా ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా అందంతో ఆకట్టుకోవాలనుకుంటారు. అప్పుడేగా అభిమానులు, ఆఫర్స్, రెమ్మ్యునరేషన్స్ పెరిగేది. అందం పెరిగితే అన్ని పెరుగుతాయని అందం కోసం కష్టపడుతుంటారు హీరోయిన్స్. అలా అందంగా కనిపించడం కోసం చిన్నప్పుడు తాను ఎంతో కష్టపడ్డానని చెప్పుకొచ్చింది హీరోయన్ తాప్సీ.
పింక్, తప్పడ్, హసీనా దిల్‌రుబ వంటి విభిన్న చిత్రాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది తాప్సీ. ప్రస్తుతం మాజీ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌లో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పింది. ‘నా కళ్లు పెద్దగా, చూడచక్కగా ఉండవు. సినిమాల్లో చూపించే హీరోయిన్స్‌లా నా ముక్కు సన్నగా ఉండదు. పెదవులు అందంగా కనిపించవు. ఆఖరికీ జుట్టు కూడా రింగు రింగులుగా కనిపిస్తుండేది. టీవీలో కనిపించే నటీమణులకు సైతం నాలాంటి జుట్టు ఉండదు. దాంతో ఏం చేయాలో అర్థం కాక.. సెలూన్‌కి వెళ్లి కెమికల్స్‌తో హెయిర్‌ని అందంగా చేసుకునేదాన్ని.
అలా ఓ రెండుసార్లు చేయించుకున్నాక.. నాకు జట్టు రాలడం ప్రారంభమైంది. దాంతో మళ్లీ వాటి జోలికి పోలేదు. నిజం చెప్పాలంటే.. అందానికి పరిమితులుగా చెప్పుకొనే కొన్నింటికీ నేను సరిపోను. అందుకే ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను నేను మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ విజయం సాధించలేకపోయాను. జీవితాన్ని ప్రేమతో జీవించాలని, మనల్ని మనం ఇష్టపడితే తప్పకుండా బాహ్యప్రపంచానికి ఎంతో అందంగా కనిపిస్తామని అర్థమైంది. అప్పటి నుంచి అందంపై నా అభిప్రాయం మారింది’’ అని తాప్సీ అందానికి అసలైన సీక్రెట్ తెలిపింది.