ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించనప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పూర్తి మద్దతుగా నిలవాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని పీటీడీ వైఎస్సార్ ఉద్యోగుల సంఘం పేర్కొంది. మానవీయ దృక్పథంతో ముఖ్యమంత్రి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయంతో 55 వేలమంది ఉద్యోగులకు శాశ్వత ప్రయోజనం కలిగిందని గుర్తుచేసింది. అదేరీతిలో ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళవారం వినతిపత్రం ఇచ్చింది.
ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్సేషన్ చేయడంతోపాటు పే స్కేల్ స్థిరీకరించాలని కోరింది.ఆర్టీసీ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించడంతోపాటు 2017 పీఆర్సీ బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులకు మధ్య ఉన్న 19 శాతం ఫిట్‌మెంట్ వ్యత్యాసాన్ని భర్తీచేయాలని, పెండింగులో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోరింది. సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన వారిలో పీటీడీ వైఎస్సార్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు డి.ఎస్.సి.రావు, ఉపాధ్యక్షుడు జేఎం నాయుడు, ప్రధాన కార్యదర్శి కె.అబ్రహం తదితరులున్నారు.