చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంపై తెలుగు ప్రేక్షకులు అంచనాలు భారీగా పెట్టుకుని ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే. రికార్డు స్థాయి బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా మొదట ఏఆర్ రహమాన్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. రహమాన్ అవ్వడంతో తెలుగులోనే కాకుండా హిందీ మరియు తమిళంలో కూడా భారీ అంచనాలు పెరగడం ఖాయం అని అంతా భావించారు. కాని అనూహ్యంగా రహమాన్ ఈ చిత్రం నుండి తప్పుకున్నట్లుగా ప్రకటించాడు. రహమాన్ స్థానంలో బాలీవుడ్ సంగీత దర్శకుడిని మెగా కాంపౌండ్ ఎంపిక చేయడం జరిగింది.
రహమాన్ ఎందుకు ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు అనే విషయంలో మాత్రం రెండు వైపుల నుండి క్లారిటీ రాలేదు. తాజాగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కి విడుదలైన ‘నవాబ్’ సినిమా ప్రెస్ మీట్లో రహమాన్ మాట్లాడుతూ పలు విషయాలపై స్పందించాడు. సైరా నుండి ఎందుకు తప్పుకున్నారు అంటూ ప్రశ్నించిన సమయంలో మాత్రం ఆ విషయం తప్ప మరే విషయమైనా అడగండి అంటూ సమాధానం దాటవేశాడు. తెలుగులో సినిమాలు చేయాలని తనకు ఉందని, తప్పకుండా త్వరలో ఒక మంచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా వస్తాను అంటూ రహమాన్ చెప్పుకొచ్చాడు.