హమాస్​ కోసం అరబ్ దేశాలు..ఇజ్రాయెల్ వైపు అమెరికా, ఈయూ మద్దతు..

Arab countries for Hamas.. America and EU support for Israel..
Arab countries for Hamas.. America and EU support for Israel..

ఇజ్రాయెల్-హమాస్​ల మధ్య యుద్ధం రోజురోజుకు భీకరంగా మారుతోంది. ప్రస్తుతం ఇజ్రాయెల్​ రివేంజ్ మోడ్​లో భీకర యుద్ధం చేస్తోంది. పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్‌ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇందులో ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? అనే అంశం ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఇప్పట్లో ఈ యుద్ధం ఓ కొలిక్కివచ్చేలా కనిపించడం లేదు..

ఓవైపు ఇజ్రాయెల్‌ దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరి అవుతుండగా.. ఇంకోవైపు, లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకురావడం.. ఇదే సమయంలో.. ఖతర్‌, ఇరాన్‌లు పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుండటం ప్రపంచ దేశాలను బంబేలెత్తిస్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌కు పూర్తిగా అండగా ఉంటామని అమెరికా, ఈయూ దేశాలు ప్రకటించడం ఐరాసను కలవరపెడుతోంది.

పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో ఇజ్రాయెల్‌ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుండగా బుధవారం రోజున ఇజ్రాయెల్​పై లెబనాన్‌, సిరియాల్లో హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు దాడులకు తెగబడ్డాయి. ఇప్పటికే గాజాలో ఇజ్రాయెల్‌ దాడులతో పరిస్థితి దిగజారుతోంటే.. ఇప్పుడు లెబనాన్, సిరియా దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయని ఐరాస ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇరుపక్షాలు కాస్త సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని విజ్ఞప్తి చేస్తోంది.