మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రోడ్డు మీద జరిగిన తగాదా ఓ యువ ఆర్కిటెక్టు ప్రాణాలు బలిగొంది. మొదటి వివాహ వార్షికోత్సవానికి నాలుగు రోజుల ముందు అతడు మృతి చెందడం మరింత విషాదకరం. వివరాలు.. సిద్ధార్థ్ సోని(32) ఇండోర్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ఆర్కిటెక్టుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం విధులు ముగించుకుని కారులో ఇంటికి బయల్దేరాడు. పలాసియా ఏరియా పరిసర ప్రాంతాల్లో అతడి కారు, స్కూటర్ మీద వెళ్తున్న వికాస్ యాదవ్ అనే వాహనదారుడిని ఢీకొట్టింది.
దీంతో వెంటనే కారు నిలిపివేసి కిందకు దిగిన సిద్ధార్థ్, వికాస్‌కు క్షమాపణలు చెప్పాడు. కానీ అతడు మాత్రం వీరావేశంతో ఊగిపోతూ అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో వికాస్, సిద్ధార్థ్‌ను నెట్టివేయగా, అటుగా వస్తున్న ట్రక్కు చక్రాల కింద పడి నలిగిపోయాడు. ఘటనాస్థలిలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో వికాస్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా వికాస్, టక్రు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. హత్యానేరం కింద అభియోగాలు నమోదు చేశారు.